Sunday, November 16, 2014

చిత్రపటం 

రాత్రంతా గుండె గోదారి ఉప్పొంగి ఉప్పొంగి 
తెల్లారేసరికి ప్రకృతి  బలప్రదర్శన ను చూస్తూ 
స్తాణువై నిలుచుండి పోయింది

హృదయ ద్వారం దగ్గరకు వెళ్లాను 
ప్రశాంతంగా ఉంది 
ఎండిన కన్నీటి చారికల్ని 
మాటలతో తుడిచేందుకు ప్రయత్నించాను 

వద్దంటూ ముఖం తిప్పుకుంది 
దోసిలిలోకి ఊపిరిని తీసుకుని లాలించాను 
ఎందరెందరో చర్చలో పాల్గొన్నట్లున్నారు 
వారికి మూలం తానే కదాని నవ్వుకున్నాను 

భూమి పైన 
గుండె లోపల అంతా తానే ఉన్నానంటుంది  
నన్ను నడిపిస్తున్న వారంతా పసి పిల్లలు అంటుంది  
సమాధానంగా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను 

ఆ  హృదయం లో పూచిన ప్రతి పువ్వు 
నాకు సుపరిచితమే 
అందుకే ఆ తోటలో నిత్యం దీపమై వెలుగుతుంటాను  

ఒక జీవిత కాలం 
అందరికీ పంచాలంటే కష్టతరమే !
కానీ పెంచుకోవడానికి మాత్రం గుండె తప్పనిసరి !

అందుకే 
ఒక హృదయం నుండి మరో హృదయానికి 
ప్రయాణించాలంటే ఎలాంటి వాహనం అవసరం లేదు 
ప్రకృతి మాత చిత్రపటం పై సన్నని గీతైతే చాలు !

కానుక..! 

ఆకాశమంతా ప్రయాణించి ప్రయాణించి 
కళ్ళ ముందు చిత్తరువవుతుంది భూమి !

ఎంత ఎండ కాసినా 
ఎంతగా కన్నీరు కురిసినా 
పచ్చదనం కోసమే భూమి నివాసం 

నాకేదో కావాలని 
నువ్వేదో అనుకుంటావని 
దారి మరల్చి పోవడానికి 
ఇదేమి దాచి పెట్టుకునే వస్తువు కాదు 
పక్షి నోట కరుచుకున్న పురుగు కాదు 
జనన మరణాల తో సంభాషణ జరిపే అవని !

మరి నిద్రను వదిలి 
మంచుతెరల మధ్య ఆకాశాన్ని గమనిస్తావా ?
ఆశయ సౌధాల నుండి 
అత్యాశా యుగాలను అంటిపెట్టుకుని 
భూమిని ప్రవాహ దిశ వైపుగా కొట్టుకు పొమ్మంటావా ?

దట్టమైన చీకట్లు  కమ్ముకున్న వేళ 
వెలుగును గ్రహించలేని హృదయాలు 
ఎక్కడ ఖాళీ ఉందొ గుర్తించలేరు 
వెన్నెల రాత్రి భాష ను గమనించలేక 
రసాయనిక చర్యల తాలుకు సంభాషణ కొనసాగిస్తారు 

ఆకలికి అర్థం అక్కరలేదు 
ఆవేశానికి సందర్భంతో పనిలేదు! 
మట్టిని మోస్తూ వెళుతున్న 
చిరుగుల భూమికి మాత్రం 
పునరావాస చిగుళ్ళు కావాలి ! 
ఆకుపచ్చని స్పర్శ కానుకగా ఇవ్వాలి !
  

జీవనది
ఒక్కసారైనా
ఆ ఇంట్లోకి అడుగేయగలనా ?
నా ప్రపంచానికి నే అతిదినే
ఆ ఇంటికి మాత్రం పరాయిని కాలేను
పాలరాతి భవనమైనా నా కంటికి
ఆకాశాన్ని తాకే పాము పడగలా కనిపిస్తుంది
నిలువెత్తు ధ్వజస్తంభం ఉన్న గుడి అది
ఒక్క రాత్రయినా నిద్రిస్తే చాలనిపిస్తుంది
అసలు ఆ ఇల్లు నాది కాదు
కానీ ఆ ఇంటి గోడలో దాగున్న ఇటుకను నేను
అక్కడి వారెవరు నా వారు కారు
ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్న బంధువుని నేను
అక్కడున్న నాలుగు గదుల సంభాషణల మధ్య
నా పేరును వెదుక్కోలేను
అసలు అక్కడ అనుభంధమే ఉందొ లేక
ప్రతిభంధకాలు నివసిస్తున్నాయో తెలియదు
నాలు ఇల్లే లేదని  ఆరుబయట నిద్రించను
అక్కడ నాదంటూ ఏమి లేదని చూపుల్ని అతికించను
అది నా దేవుడున్న దేవాలయం
నాది ఏమి మాట్లాడలేని ఒక దేహం !
తలంపు ఒక జీవనది
నిత్యం ఆ గుండెలో ప్రవహిస్తూ ఉండిపోతాను
ష్ ! ఆగండి !
నా లోకం నిద్రపోతోంది ! జోల పాడాలి !
నీడ బొమ్మ 

సుదూర తీరాన 
శూన్య చిత్రాన్ని చూసాను 
అక్కడ వెలుగు లేదు 
వెలిగించే వారున్నా ఆస్వాదించేవారు లేరు 

మంచు దుప్పటిపై ఉన్న 
నక్షత్రాల మెరుపును చూసాను 
అక్కడ మృదుత్వం లేదు 
పులవనానికి కాపలా ఎవరు లేరు 

ఎక్కడున్నా క్షేమమే కదాని 
శరీరంపై గాయాల్ని మరిచాను 
గుండె తాలుకు స్పందన లేదు 
మనసున్న పలకరింపు గాని వినిపించలేదు 

పగలంతా 
నేను నా వెంటే ఉంటానని అనుకున్నాను 
కన్నీటి ఆనవాళ్ళు కనిపించలేదు 
ఎవరి నుండి ఏ సమాధానం ఎదురు చూడలేదు 

జనం మధ్య ఏకాంత వాసిని 
ఒంటరిగా సముహవాసిని 
తరలిపోయిన వర్షబింబం చూడలేకపోయాను
అడవి రాల్చిన వెన్నెలలో నీడనయ్యాను 

ఇంతకీ నువ్వు ఏమయ్యావు ?
జలపాతమై హర్షించావా ?
జనారణ్యం లో తప్పిపోయావా ?
గంతలు కట్టిన ఆకాశానికి వారధి అయ్యావా ?

నీడబొమ్మ నడిస్తే నీవు నడిచినట్లే 
వెలుతురులో నువ్వు నడిస్తే నేను నీడనైనట్లే !

కొన్ని తప్పవు 

తప్పదు 
కొన్ని క్షణాలకు కొన్ని క్షణాలు వారధి కట్టాల్సిందే 
కొన్ని స్థితులకు కొన్ని పరిస్థితులు మూలం అవ్వాల్సిందే 
తెలియజేయడానికి కారణం ఏదైనా కావచ్చు 
కొన్ని ప్రశ్నలు ప్రశ్నల్లా ఉండిపోవాల్సిందే !

తప్పదు 
వానచుక్కలు కురుస్తున్న గుండె లోగిలిలో 
మాదిరి పంచదార చినుకులు ఉనికి కనబడల్సిందే !
మంచపు కోళ్ళను అనుకున్న దోమతెరే కావచ్చు  
నన్నేమి చెయ్యలేవనే ధైర్యం చూపాల్సిందే !

తప్పదు 
విశాలమైన ఉద్యానవనం లో పువ్వులు గట్టి కాపలా లో ఉన్నా 
మట్టి రేణువుల సువాసనతో చిద్విలాసం చేయాల్సిందే !
జలపాతం ఒడ్డున కూర్చున్న ఆసామి ఎవరైనా కావచ్చు 
స్వరపేటిక పై విలువలున్న సంతకంలో అక్షరమై నిలవాల్సిందే !

తప్పదు 
విషాదం సముద్రాన్ని అద్దం లా వాడుకున్నా 
ప్రతిబింబ చాయలు రైలు పట్టాల్లా దు;ఖించాల్సిందే !
ప్రపంచమంతా అలిగి మూలనున్న ఖాళీ సంచి కావచ్చు 
నలుగు పెట్టి స్నానించిన సూర్యుడు భూమిని తాకాల్సిందే ! 

మనసు మరణించి చాలా కాలమైంది 
జయంతులు , వర్దంతులు ఎన్ని జరుపుకుంటున్నా 
మనిషి మాటల్లో చేరి జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు ! 
అయినా భూమిపై ఉహించుకుంటూ బతకాల్సిందే ! 
ఎవరున్నారని ..?

విశాలప్రపంచంలో జీవించడానికి 
కాస్త చోటులేదు కదాని బాధపడ్డాను 
అయితే ఏమి మనుషులున్నారు కదా 
అనుకుని తరచి చూస్తే అర్థమైంది 
వారికి మనసును వాడటం మరచిపోయారని.. . 

ఆలోచించడం మొదలుపెట్టాను 
ఏమి పర్వాలేదు 
పక్షులున్నాయి కదా అనుకున్నాను 
ఆకాశంలోకి చూస్తుంటే అర్థమైంది 
అవి కూడా ఇక్కడ ఉండలేక 
వలసపోతున్నాయని  

జంతువులున్నాయి కదా 
అనుకుంటూ నడుస్తున్నాను 
తర్వాత తెలిసింది  
మిగతావన్నీఅడవుల్లేక  
ప్రాణాలే వదిలేస్తున్నాయని 

అయిన ధైర్యంగా అనుకున్నాను 
అందరికీ సమానమైన ప్రకృతి ఉంది కదాని 
గమనిస్తుంటే తెలుస్తోంది 
అది కూడా ఏమి చేయాలో తెలియక 
ఏదో ఒకటి చేసేస్తోందని.. 

కనీసం ఇంటి నాలుగు గోడలున్నాయికదా 
అవి కాపాడతాయనుకున్నాను
దానిపై పడిన చారికలు గమనించాక తెలిసింది  
పైని పడిన వానకు తట్టుకోలేక బలహీనమై 
అవి కూడా కన్నీరు పెడుతున్నాయని

ఇక ఏమిచేయలేక 
తప్పనిసరిగా నడిచేస్తున్నాను 
ఆలోచించేస్తున్నాను 
కష్ట సుఖాలపై చర్చలు చేస్తున్నాను 
మొత్తం మీద బతికేస్తున్నాను  

Tuesday, October 21, 2014

చరిత్ర ఎవ్వరినీ వదలదు 

చరిత్ర ఎవ్వరినీ వదలదు 
కావాలని వెంట పడిన వారినీ వదలదు 
వద్దని పారిపోయారని అనుకోదు 
ఎన్నో రహస్యాలను ఆపాత శిధిలాలలో దాచి ఉంచడం మరువదు 

మనవాళ్ళకు, ముని మనవాళ్ళకు కధలుగా చెప్పాలని 
తెలివిగా చేజారిన స్వప్నమవుతుంది 
ఏమీ తెలియకున్నా ఏదో తెలిసినట్లు ప్రవర్తించి 
భావితరాలకు వాస్తవ ప్రతిబింబమవుతుంది 

ఏది చూసినా ఎక్కడో చూసినట్లుంటుంది 
పూర్వజన్మ తాలుకు స్వస్థలమా ?
లేక తిరిగి తిరిగి మరచిపోయిన పరిచయ స్వరమా ?
ఒక్కో మనిషిని ఎక్కడో చూసినట్లు ఉంటుంది 

మాట్లాడిన మాటలు ఎప్పుడో మాట్లాడినట్లు 
నడిచిన స్థలాలన్నీ నాతో ఎప్పటినుండో ఉన్నట్లు 
తాకిన స్పర్శలన్నీ సుపరిచితమైనట్లు 
ఏదో కాస్త అస్పష్టత ! మరి కాస్తంత అస్వస్థత !

సంస్కారం ! సౌశీల్యత ! సౌభాగ్యం !
ఇదివరకెన్నడు లేనంత ఆకాశమంత ఎత్తుగా !
వర్తమానం భవిష్యత్ తో కలిసిరానంత ఆనందంగా 
కంటి రెప్పలు బరువైతే కలత కాదనే నీతి రాజనీతి !

కంటికి కనిపించినదంతా ద్వంద్వ రీతి 
మనసంతా అంధకారమైన వ్రుక్షమైనప్పుదు 
మండుటెండల స్వభావంతో 
తిమ్మిర్లు ఎక్కే చూపులతో 

మబ్బులు కమ్మినట్లున్న ఆలోచనలతో 
ఆత్మా నేత్రం తెరిచే ఉందని చెబితే నమ్మేవారెవరు ?
దేశమంతా నాదే అనే వాదనలను భరించే వారెవరు ?
మానవీయత వసంత రాగం పాడుతుంటే కాదనే వారెవరు ?

దానవత్వం కల్యాణి రాగం పాడుతుంటే వినేవారు ఎవరు ?
ఎల్లప్పుడూ నడిచే దారిలో 
మెరుపు మెరిసే సరికి మాట రాలేదు !
కాలాన్ని మిగేసేలా ఆ చూపులు 

ఎవరికీ వారుగా నిలవనీయడం లేదు 
వృక్షాలను రక్షించాలని 
కోరికల్ని జయించాలని 
శిశిరాన్ని చూస్తూ ఆనందించాలని 

గ్రీష్మాన్ని తప్పక భరించాలని 
అనుకుని భారంగా నడుస్తున్న ఆ రూపం 
నెల గుండెలో పులు పూయించింది 
కన్నీటిని పన్నీటిగా మార్చింది 

ఆ మాటలు వినిపించలేదు అంటూ 
నీడ మాట్లాడుతూనే ఉంది 
శిఖలు ఎప్పుడు తప్పుకున్నాయో ఏమో 
అందరినీ ఒకనాడు వదిలి వెళ్ళిపోయాయి 

ఇప్పదిదాకా ప్రకృతిని అనుసరించిన ఆ దృశ్యాలు 
ఇంతలో ఏమైపోయినట్లు ?
దీపం నాదంటే నాదని నాతోనే ఉండపోతుందా 
దీపం ఇంటిదని ముట్టుకుంటే ఊరుకుంటుందా